ఏపీలో ఎన్నికల హడావిడి నడుస్తోంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోలింగ్ బ్యాలెట్ సమర్పణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును ఏప్రిల్ 26 వరకూ పొడిగించినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఉద్యోగులు తాము పనిచేసే చోటే ఫారమ్ -12 ఇవ్వవచ్చని వెల్లడించారు. ఈ మేరకు ముకేష్ కుమార్ మీనా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ సమర్పణకు ఆఖరి తేదీ ఏప్రిల్ 22వ తేదీనే అని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో చాలామందికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవటంతో పాటుగా ఏ జిల్లాలో ఓటు వేయాలనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 26 వరకూ పోస్టల్ బ్యాలెట్లు సమర్పించవచ్చని ఏపీ సీఈవో తెలిపారు.
ఇక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తాము విధులు నిర్వహిస్తున్న చోట ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయవచ్చని ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పీవో, ఏపీవో, పోలీసులు, సెక్టార్ ఆఫీసర్లు, వీడియో గ్రాఫర్లు మొదలైన వారు తాము పనిచేస్తున్న చోటే ఫారమ్ 12 సమర్పించవచ్చని తెలిపారు. ఆ తర్వాత వాటిని తమ సొంత నియోజకవర్గానికి పంపేలా ఈసీ చర్యలు తీసుకుంది. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు వీలుగా వారికి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఏప్రిల్‍లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ నాలుగవ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలను మాత్రం అన్ని దశలూ పూర్తైన తర్వాత జూన్ 4వ తేదీన వెల్లడించనున్నారు. ఇక ఎన్నికల విధుల్లో ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతే ఈసీ ఈ అవకాశం కల్పిస్తోంది.