కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి ఓటును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవడానికి కొన్ని నిబంధనలు పెట్టారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటరు దరఖాస్తును స్వీకరించడానికి ఈనెల 22న చివరి తేదీ అని తెలిపారు. ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని వారికి సమయాభావం కారణంగా పోస్టల్ బ్యాలెట్‌ను సమర్పించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఓటర్లు తమ ఓటును దరఖాస్తు చేసుకోవడానికి, స్వీకరించడానికి ఈనెల 30వ తేదీ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులకు క్యాజువల్ లీవ్‌ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. వేసవి దృష్ట్యా చాలా మంది ఓటర్లు తమ పోస్టల్ బ్యాలెట్‌ను కూడా వేయలేకపోతున్నారని వివరించారు. అందువల్ల వారి పోస్టల్ బ్యాలెట్‌ను వేసే సదుపాయం 13 మే, 2024 తర్వాత మరో నాలుగు రోజుల పాటు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ అంశాలను పరిశీలించి, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులను ఇవ్వాలని సత్యకుమార్ కోరారు.