ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా ఉచిత పథకాలు ప్రకటించకుండా ఎలా నియంత్రించాలన్నదానిపై విస్తృత చర్చ జరగాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని, ఇందుకు కేంద్రప్రభుత్వం, ప్రధాని చొరవ తీసుకోవాలని సూచించారు. పార్టీల ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచితాల వల్ల జరుగుతున్న లాభలేంటి.. వాటి వల్ల నష్టమేంటి అన్నదానిపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రధాని మోదీ చెప్తున్నట్లు 2029కల్లా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా అప్పటికీ మనది పేద దేశంగానే ఉంటుందన్నారు.