తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా బీఫామ్‌లు అందజేశారు. లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్‌లు పంపిణీతో చంద్రబాబు నివాసంలో సందడిగా మారింది. అభ్యర్థులంతా తమ అనుచరులతో కలిసి వాహనాల్లో ఒకేసారి తరలిరావడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కనిపించింది. బీఫామ్‌లు అందజేసిన అనంతరం.. చంద్రబాబు అభ్యర్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు.
బీఫామ్‌ల పంపిణీ కార్యక్రమానికి 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరుకాలేదు. వీరిలో తంబళ్లపల్లె, దెందులూరు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్‌లను పార్టీ పెండింగ్‌లో పెట్టింది. దీంతో అక్కడ అభ్యర్థులుగా ప్రకటించిన జయచంద్రారెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఉండవల్లికి రాలేదు. అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయమై కొలిక్కివస్తే.. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫాంల పంపిణీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనపర్తి స్థానాన్ని పొత్తులో బీజేపీ కేటాయించారు. అక్కడ నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తుండటంతో కొంత గందరగోళం కనిపిస్తోంది. అనపర్తి సీటు టీడీపీ తీసుకుంటే.. తంబళ్లపల్లె, దెందులూరుల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దెందులూరు నుంచి టీడీపీ, జనసేన, భాజపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ సోమవారం నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో గందరగోళం కనిపిస్తోంది.
మరో 12 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా బీఫామ్‌ల పంపిణీ కార్యక్రమానికి రాలేదు. వీరిలో నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్లి, తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలు, మరికొందరు దూరం అనే భావనతో రాలేదని తెలుస్తోంది. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి తరఫున ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి బీఫామ్‌లు అందుకున్నారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నారు. బీజేపీ చేరి కమలం గుర్తుపై పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు నల్లమిల్లి నిర్ధారించారు. రాజమహేంద్రవరానికి చెందిన బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు రామవరంలో నల్లమిల్లితో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని, ఆయన విజయానికి అంతా కృషి చేస్తామని తెలిపారు. ఏ గుర్తుపై బరిలో ఉంటారని ప్రశ్నించగా కూటమి గుర్తుపైనేనని తెలిపారు. 20 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించానని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. కూటమి పెద్దలతో చర్చించి ప్రకటిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. నల్లిమిల్లి 23న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి డీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa