వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెబుతున్నారని వైయస్‌ఆర్ సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వైయస్ భారతికి పులివెందుల ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో సీఎం వైయస్ జగన్ చేసిన మంచిని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అనంతరం వైయస్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలందరికీ మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని, అందులోని అంశాలను మా బిడ్డ జగన్ అమలు చేస్తాడని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డు కావాలని, చదువుకు సాయం, వైద్యానికి సాయం కావాలని చాలా అర్జీలు వచ్చాయని, ఈసారి అలాంటి దరఖాస్తులు రావడం లేదన్నారు. అన్నీ పారదర్శకంగా అమలువుతున్నాయి కాబట్టి అర్జీలు పెట్టుకునే అవకాశం లేదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత చాలా బాగుందని, అది కొనసాగుతుందని చెప్పారు.