విజయవాడ తూర్పు నియోజకవర్గం భారతీనగర్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ దారుల ప్రాణాలు పోయినా ... జగన్‌కు రాజకీయ లబ్ది ముఖ్యమని మండిపడ్డారు. నెల క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదన్నారు. మానవత్వం లేకుండా వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యతిరేకతను అనుకూలం చేసుకుని జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ చేసే పనులకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. అనేక మంది ఆవేదనతో జగన్‌ను శపిస్తున్నారన్నారు. పరదాలు కప్పుకుని, భద్రత నడుమ దాక్కుని వెళ్లే జగన్‌కు ప్రజల కన్నీళ్లు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల ఆస్తులను దోచుకునేందుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తెచ్చారన్నారు. కుట్రతో లిటికేషన్ పెట్టి స్థలాలు కబ్జా చేయాలనే కుట్ర ఇది అని చెప్పుకొచ్చారు. మనకి తరతరాలుగా వస్తున్న ఆస్తుల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. పాస్ పుస్తకాలు, మైలు రాళ్లపై ఫోటోలు ఏమిటో? అంటో వ్యాఖ్యలు చేశారు. జగన్ మాయను, మోసాలను ప్రజలు గుర్తించారని... బుద్ధి చెబుతారన్నారు. ఐదేళ్లల్లో రాష్ట్రం నాశనం అయ్యిందని... పేదల జీవితాలు తిరోగమనం అయ్యేలా చేశారని మండిపడ్డారు. 1994లో టీడీపీ విజయం తరహాలో ఈ ఎన్నికలలో కూటమి విజయం ఉంటుందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.