ముఠా కార్మికులు సేద తీరే ప్రాంతాల్లో చెట్లు తొలగించి నీడ లేకుండా చేశారని కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మండిపడ్డారు. ఇక్కడ ఉన్న ప్రజలే వాళ్లు ఏమీ చేయలేదని చెబుతున్నారన్నారు. వాళ్లు రాక ముందు సమస్యలు ఏమిటని.. ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడ పని చేసిన ఎమ్మెల్యే, ఎంపీలను చూసి జాలి కలుగుతుందన్నారు. ఇటువంటి వారి మాటలు నమ్మి ప్రజలు వారిని ఎన్నుకున్నారన్నారు. ఐదేళ్లుగా అభివృద్ది లేక, సమస్యలు పట్టించుకునే వారు రాక ప్రజలు మోసపోయారన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ప్రటనలు ఇవ్వడం కాదని.. మురుగు కంపులోకి వచ్చి మాట్లాడితే.. వైసీపీ వాళ్లు ఏం చేయలేదో తెలుస్తుందన్నారు. ‘‘అందుకే నేను ఈ ఐదేళ్లల్లో ఏం చేస్తానో, ఎలా చేస్తానో ప్రజలకు చెబుతున్నా. డివిజన్ వారీగా అభివృద్ధికి, యువత సంక్షేమానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశాను. అందుకే ఇంత ధైర్యంగా నేను ప్రజలకు హామీ ఇస్తున్నా.. భరోసా కల్పిస్తున్నా’’ అని స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబుల సారధ్యంలో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా అని సుజనా చౌదరి వెల్లడించారు.