ఏపీలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఎండల్లో బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. అయితే అనేక మంది అకౌంట్లు ఇన్ ఆపరేట్‌లో ఉండటంతో పెన్షన్‌ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పెన్షన్ కోసం పెద్ద సంఖ్యలో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలతో అగచాట్లు పడుతున్నారు. వడదెబ్బతో కొంతమంది వృద్ధులు అస్వస్థతకు గురవుతుండగా.. పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అటు ఉమ్మడి కడప జిల్లాలో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగలడంతో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. మొన్న రాయచోటిలో ఒకరు, నేడు (శనివారం) బద్వేల్ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బ తగిలి మృత్యువాతపడ్డారు. బద్వేల్ పట్టణం సురేంధ్రనగర్‌లో పెన్షన్ కోసం బ్యాంక్‌కు వెళ్లిన ఎల్లమ్మ (64) వడదెబ్బతో మృతి చెందింది. అలాగే బద్వేల్ అమ్మవారిశాల వీధిలో రామయ్య (72) అనే వృద్ధుడు పెన్షన్ కోసం తిరిగి ఎండ తీవ్రతకు వడదెబ్బ తగడలడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆధార్ లింక్ కాక పోవడంతో రెండు రోజులు ఎండల్లోనే బ్యాంకు చుట్టూ తిరిగిన రామయ్య చివరకు మృత్యువాతపడ్డాడు. కాగా.. ఇన్‌ఆపరేట్ అయిన అకౌంట్లను ఆపరేట్‌లోకి తీసుకువచ్చేందుకు ఆధార్ లింక్ తప్పని సరి బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆధార్ లింక్‌ల కోసం పదే పదే పెన్షన్‌దారులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరగుతున్నారు. దీంతో వడదెబ్బ తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.