ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పార్టీల తరఫున టికెట్ తెచ్చుకునేందుకు కోట్ల రూపాయల డబ్బును కుమ్మరిస్తూ ఉంటారు. టికెట్ వచ్చిన తర్వాత ప్రచారం, ఓటర్లకు పంచేందుకు మరిన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. గెలుపు సంగతి పక్కన పెడితే ఎన్నికలు అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. అయితే ఈమె మాత్రం అలా కాదు. ఎన్నికల బరిలో నిలిచి ఖర్చు పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ.. పార్టీ ఇచ్చిన టికెట్‌ను వెనక్కి ఇచ్చేసింది. దీంతో ఈ సంఘటన ఎన్నికల వేళ.. దేశవ్యా్ప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్‌ను సుచరిత మొహంతి అనే అభ్యర్థి వెనక్కి ఇచ్చేసింది.
గతంలో జర్నలిస్ట్‌గా పని చేసిన సుచరిత మొహంతి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ బ్రజమోహన్ మొహంతి కూతురు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన సుచరిత మొహంతి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేడీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా అదే స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకుని పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా ఖర్చులు అవుతాయని.. అయితే నిధుల కొరత కారణంగానే తాను బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు సుచరిత మొహంతి ప్రకటించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై సుచరిత మొహంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు ఎన్నికల్లో ప్రచారం కోసం ఫండ్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించిందని.. సొంత ఖర్చులతోనే ప్రచారం చేసుకోవాలంటున్నారని.. ఒడిశా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజోయ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు సుచిత్ర మొహంతి లేఖ పంపారు. సొంత నిధులతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత సత్తా తన వద్ద లేదంటూ పేర్కొన్నారు.
వృత్తిపరంగా తాను జర్నలిస్ట్‌ను అని.. 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని.. పూరీ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి తన వద్ద ఉన్నదంతా ఇచ్చేసినట్లు తెలిపారు. ఇక చివరికి ప్రజల దగ్గరి నుంచి విరాళాలు స్వీకరించే ప్రయత్నం చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా.. ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుచరిత మొహంతి పేర్కొన్నారు.