రోజురోజుకూ మనుషుల మధ్య సంబంధాలు ఎంతకు దిగజారుతున్నాయి అని చెప్పడానికి ఇలాంటి ఘటనే ఉదాహరణ. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దు, అబ్బాయిలతో ఫోన్‌లో మాట్లాడటం, చాట్ చేయడం వద్దు అని చెప్పిన అన్ననే కడతేర్చింది ఓ 14 ఏళ్ల బాలిక. అన్న నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని వచ్చి దాడి చేసి హతమార్చింది. అయితే ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చాలనే ప్రయత్నించింది. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో వాళ్లు తమ స్టైల్‌లో విచారణ జరపగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికంగా ఉన్న అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలిక తన అన్న 18 ఏళ్ల యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చింది. అయితే అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని.. ఎందుకు చాట్ చేస్తున్నావని ఆ అన్న మందలించడంతో ఆ బాలిక కోపం పెంచుకుంది. ఆమె తరచూ అబ్బాయిలతో ఫోన్ మాట్లాడటం, చాట్ చేయడం.. అన్న గమనించాడు. అయితే అలా చేయొద్దని మొబైల్ వాడటానికి వీలు లేదని గట్టిగా మందలించాడు.
దీంతో ఆ బాలిక తన అన్నపై విపరీతమైన కోపం పెంచుకుంది. దీంతో అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని మెడపై నరికింది. ఈ ఘటనలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అన్నను నరకడంతో ఆమె చేతులకు రక్తపు మరకలు అంటుకున్నాయి. వెంటనే వెళ్లి స్నానం చేసింది. తర్వాత రక్తపు మరకలతో ఉన్న దుస్తులను దాచిపెట్టింది. తాను హత్య చేసినట్లు ఉండే అన్ని ఆధారాలను చెరిపేసింది. చివరికి తన అన్నను ఎవరో గొడ్డలితో నరికి చంపారని చుట్టుపక్కల వారికి చెప్పింది.
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఆ బాలికను తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకుంది. చివరికి తానే తన అన్నను హత్య చేసినట్లు అంగీకరించింది. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో గొడ్డలితో నరికి చంపినట్లు వెల్లడించింది. అబ్బాయిలతో తాను ఫోన్‌లో మాట్లాడినందుకు తనను అన్న తిట్టాడని అందుకే చంపేశానని తెలిపింది.