టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైన కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్‌పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై ప్రత్యర్థులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.అసలేం జరిగిందంటే...గత రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్న సమయంలో దుండగుల కారు వేగంగా వచ్చి నిఖిల్‌ను ఢీకొట్టింది. ఆపై కింద పడిన నిఖిల్‌ను కారులో వచ్చిన దుండగులు రాడ్‌లతో దాడికి యత్నించారు. దీంతో నిఖిల్ తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు కారులో పారిపోయారు. ఈ ఘటనలో నిఖిల్ తలకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ వెంటనే బయటకు వచ్చి దాడిపై ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో ఆ పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి నిఖిల్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.