ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్లేందుకు చుక్కలు కనిపిస్తున్నా యి. రైళ్లలో రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటుచేయడంలో విఫలమైంది. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏకంగా 200శాతంపైగా పెరిగాయి. విమాన చార్జీల్లో ఆకాశమే హద్దుగా పెరుగుదల కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటువేసేందుకు గతంలో ఎన్నడూలేనివిధంగా భారీగా ఓటర్లు తమ స్వస్థలాలకు తరలివచ్చారు. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, పూణే తదితర నగరాలతోపాటు పలు రాష్ట్రాల్లో వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలరీత్యా ఉంటున్న వారంతా ఓటు వేయాలనే ఉత్సాహంగా భారీగా పోటె త్తారు. సోమవారం పోలింగ్ కావడం, శని, ఆదివారాలు సెలవు లురావడంతో ఓటు వేయడంతోపాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఉంటుందనే భావనతో జిల్లాకు వ చ్చారు. ఒక్క కాకినాడ జిల్లాకే సుమారు లక్షమంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చినట్టు అంచనా. అయితే ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి వెళ్లదామనుకున్న వారికి షాక్ తగిలింది. రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. బస్సులు, విమాన చార్జీలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి.