ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాక్స్‌గామ్‌ వ్యాలీపై ముదురుతున్న వివాదం,,,, చైనా నిర్మాణాలను వ్యతిరేకిస్తున్న భారత్

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:57 PM

భారత్, చైనా మధ్య 2020లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత సైనిక ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఉద్రిక్తతలను తగ్గించడానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఏడాది గడవక ముందే చైనా మరో సరిహద్దు వివాదానికి తెరలేపింది. జమ్మూ కాశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్‌గామ్ వ్యాలీపై.. చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. వాటిని కపట డ్రాగన్ దేశం తోసిపుచ్చింది.అంతేకాకుండా.. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా రోడ్లు, ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. దీనిపై ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో షాక్స్‌గామ్ వ్యాలీ భారత్, చైనాకు ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.


షాక్స్‌గామ్ వ్యాలీ గ్రేటర్ కాశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్‌కు ఉత్తరాన ఉంది. 1963లో పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం చైనాకు వెళ్లిపోయింది. భారత్ మాత్రం ఆ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమైనదని, చెల్లదని పేర్కొంటూ ఎన్నడూ గుర్తించలేదు. అప్పటినుంచి ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉంది. ఇటీవల అక్కడ చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడంతో మరోసారి వివాదం చెలరేగింది.


భారత్‌కు ఎందుకు ముఖ్యం?


షాక్స్‌గామ్ వ్యాలీ సియాచిన్ గ్లేసియర్ పక్కన ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ ఫ్రంట్‌లైన్ పాయింట్. ఇది భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది. అంతేకాకుండా షాక్స్‌గామ్ వ్యాలీ ఎత్తైన పర్వత మార్గాలు, లాజిస్టికల్ మార్గాలకు పక్కన ఉంది. క్లిష్ట సమయాల్లో కారకోరం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడానికి షాక్స్‌గామ్ వ్యాలీ కీలకంగా మారుతుంది. అయితే అఘిల్ పాస్ సమీపంలో చైనా రోడ్లు, మార్గాలు నిర్మిస్తోంది. వీటి ద్వారా చైనా తన బలగాలను.. సియాచిన్ సమీపంలోని భారత మిలిటరీ పాయింట్లకు దాదాపు 50 కి.మీ. దూరంలోకి తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే సరిహద్దుల వెంట సెక్యూరిటీ బ్యాలన్స్‌ మారి.. భారత ఆధిపత్యం తగ్గుతుందని అంటున్నారు. అందుకే చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా చర్చల సమయంలో భారత్‌కు బార్గేనింగ్ పవర్ తగ్గుతుంది. షాక్స్‌గామ్ వ్యాలీపై భారత్ నియంత్రణ ఉంటే.. చైనా, పాకిస్తాన్ సహకారాన్ని కట్టడి చేయొచ్చు.


చైనాకు ఎందుకు ముఖ్యం?


మరోవైపు, షాక్స్‌గామ్ వ్యాలీ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో భాగంగా ఉంది. ఈ ప్రాంతాన్ని CPECలో చేర్చడాన్ని కూడా భారత్ వ్యతిరేకిస్తోంది. అయితే ఈ షాక్స్‌గామ్ వ్యాలీని చైనా తమ ఆధీనంలోకి తీసుకుంటే.. సమీప భవిష్యత్తులో కాకున్నా, దీర్ఘ కాలంలో.. చైనాకు హిమాలయ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే భారత్ ఈ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టవద్దని గట్టిగా చెబుతోంది.


షాక్స్‌గామ్ వ్యాలీ.. చైనాకు తమ పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్ సమీపంలో బఫర్ జోన్‌గా పనిచేస్తుంది. ఈ ఎత్తైన భూభాగంపై నియంత్రణ సాధిస్తే.. భారత్ నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి చైనా తనను తాను రక్షించుకోవచ్చు. ఇక తమ సరిహద్దుల వరకు భారత్ చేరుకోకుండా చైనా నిలువరించగలదు. కాగా, ఈ వ్యాలీ నుంచి.. లఢక్, సియాచిన్ ప్రాంతాల్లో భారత సైనిక కదలికలపై చైనా నిఘా పెడుతుంది. షాక్స్‌గామ్ వ్యాలీపై డ్రాగన్ నియంత్రణ సాధిస్తే.. యుద్ధం వంటి సమయాల్లో సులభంగా సైనికులను సరిహద్దులో మోహరించవచ్చు. ఇక దీర్ఘ కాలంలో నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారత్‌తో ఏమైనా వివాదాలు నెలకొంటే.. చర్చల సమయంలో చైనాదే పైచేయి ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa