ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 రోజుల్లోనే నలుగురు విదేశీయులు బలి,,,,అమెరికా ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో మృత్యుఘోష

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 09:01 PM

అగ్రరాజ్యంలో మెరుగైన జీవితం గడపాలన్న ఆశతో సరిహద్దులు దాటి వచ్చిన వలసదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ మధ్య కాలంలోనే నలుగురు వలసదారులు కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 30 మంది మరణించగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే మరణాల పరంపర కొనసాగడం గమనార్హం.


మరణించిన వారు వీరే..


జనవరి 3వ తేదీ నుంచి 9 మధ్య కాలంలో మరణించిన వారిలో.. 55 ఏళ్ల క్యూబా వాసి గెరాల్డో లునాస్ కాంపోస్ ఉన్నారు. అయితే ఈయన టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్ డిటెన్షన్ సెంటర్‌లో జనవరి 3వ తేదీన మరణించారు. ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఐసోలేషన్‌లో ఉంచగా.. అక్కడే అపస్మారక స్థితిలో కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే హోండురాస్‌కు చెందిన 42 ఏళ్ల లూయిస్ గుస్తావో నునెజ్, 68 ఏళ్ల లూయిస్ బెల్ట్రాన్‌లు హ్యూస్టన్, కాలిఫోర్నియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. ఇక కంబోడియాకు చెందిన 46 ఏళ్ల పరాడీ లా.. ఫిలడెల్ఫియా ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో డ్రగ్ విత్‌డ్రాయల్ లక్షణాల కారణంగా జనవరి 9న ప్రాణాలు కోల్పోయారు.


అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశం నుంచి వలసదారులను భారీగా బహిష్కరించే లక్ష్యంతో డిటెన్షన్ సెంటర్లలో బందీల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం సుమారు 69,000 మందికి పైగా వలసదారులు కస్టడీలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మానవతా దృక్పథంతో వలసదారులను విడుదల చేసే విధానాన్ని ట్రంప్ సర్కార్ గణనీయంగా తగ్గించడమే ఈ రద్దీకి, మరణాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు మిన్నెసోటాలో ఒక ఐసీఈ  అధికారి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పిల్లల తల్లి మరణించిన ఘటన అమెరికా వ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. డిటెన్షన్ నెట్‌వర్క్ అడ్వకేసీ డైరెక్టర్ సెతారె ఘందేహారి మాట్లాడుతూ.. ఈ మరణాలు అత్యంత భయంకరమని.. తక్షణమే ఈ నిర్బంధ కేంద్రాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. అగ్రరాజ్యం తన ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేస్తున్న కొద్దీ.. అక్కడ ఆశ్రయం పొందేందుకు వచ్చే నిరుపేద వలసదారులు ఇలా కస్టడీలోనే అసువులు బాయడం అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతోందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa