ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌ నిరసనల్లో 12 వేల మంది మృతి..? సంచలన నివేదిక

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 09:14 PM

గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన అంతర్గత సవాల్‌న ఇరాన్ పాలకులు ఎదుర్కొంటోంది. ఇరాన్‌‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు మూడో వారంలోకి ప్రవేశించాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి ఎంతమంది చనిపోయారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అంతర్జాతీయ విదేశీ ఆధారిత ప్రతిపక్ష వెబ్‌సైట్ ప్రకారం.. భద్రతా బలగాలు ఇటీవల కనీసం 12,000 మందిని చంపాయని, ఇది ‘ఆధునిక ఇరాన్ చరిత్రలో అతిపెద్ద హత్య’ అని పేర్కొంది.


అయితే, మానవ హక్కుల సంస్థల అంచనాల ప్రకారం, మృతుల సంఖ్య కొన్ని వందల్లోనే ఉందని తెలుస్తోంది. ఇరాన్ అంతర్జాతీయ వెబ్‌సైట్ తమ సమాచారాన్ని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సభ్యులు, వైద్య అధికారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించి, ధ్రువీకరించినట్లు తెలిపింది. ఈ డేటాను అనేక దశల్లో, కఠినమైన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాతే ప్రకటించామని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఇరాన్ ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.


ఈ హత్యలు ఎక్కువగా రివల్యూషనరీ గార్డ్స్, బసిజ్ బలగాల ద్వారా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల మేరకు జరిగాయని నివేదిక చెబుతోంది. జనవరి 8, 9 తేదీల రాత్రుల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయని, ఈ హింస అనుకోకుండా జరిగిన ఘర్షణల ఫలితం కాదని, ఇది వ్యవస్థీకృతమైందని నివేదిక పేర్కొంది. ఈ అంచనాలు ఇరాన్ భద్రతా అధికారుల వద్ద ఉన్న గణాంకాలను ప్రతిబింబిస్తాయని కూడా తెలిపింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారేనని, ఇది యువత నేతృత్వంలోని అశాంతిని సూచిస్తుందని ఇరాన్ అంతర్జాతీయ వెబ్‌సైట్ తెలిపింది.


ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేదు. డిసెంబర్ 28న టెహ్రాన్ చారిత్రాత్మక బజార్‌ వర్తకుల సమ్మెలతో ప్రారంభమైన ఈ నిరసనలు, ఇప్పుడు మూడో వారంలోకి ప్రవేశించాయి. టెహ్రాన్, ఇతర నగరాల్లో భారీ ప్రదర్శనలకు దారితీశాయి. ఆర్థిక సంక్షోభాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత పాలిస్తున్న మత వ్యవస్థను అంతం చేయాలనే బహిరంగ పిలుపునకు దారితీసింది.


విశ్లేషకుల ప్రకారం.. ఈ నిరసనలు వాటి పరిమాణంతో పాటు స్పష్టమైన రాజకీయ డిమాండ్ల వల్ల కూడా ముఖ్యమైనవి. పారిస్‌లోని సైన్సెస్ పో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ నికోల్ గ్రాజెవ్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘ఈ నిరసనలు ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ఇటీవల సంవత్సరాలలో పెరుగుతున్న స్పష్టమైన రాజకీయ డిమాండ్ల పరంగా అతిపెద్ద సవాల్‌ను సూచిస్తాయి’’ అని తెలిపారు.


ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇరాన్ నాయకత్వం బహిరంగ ధిక్కారంగానే భావిస్తోంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ.. బహిరంగ నిరసనలను ఖండించారు. అధికారులు సోమవారం వేలాది మంది మద్దతుదారులను సమీకరించి ప్రతి నిరసన ర్యాలీలను నిర్వహించారు. ఇరాన్ అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో నిరసనల స్థాయిని లేదా మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధ్రువీకరించడం కష్టమైంది. గత తిరుగుబాట్లతో పోలిస్తే వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు తక్కువ సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి.


వందలాది మంది చనిపోయారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నప్పటికీ కనెక్టివిటీ లేకపోవడం అనిశ్చితిని పెంచుతోంది. ‘ఇరాన్ అణచివేత యంత్రాంగం తీవ్రత, స్థితిస్థాపకత కారణంగా నిరసనలు నాయకత్వాన్ని తొలగించగలవా అనేది అస్పష్టంగా ఉంది’ అని గ్రాజెవ్‌స్కీ అన్నారు. ప్రస్తుత అశాంతి, 2009 ఎన్నికల తర్వాత జరిగిన నిరసనలు, మహసీ అమినీ కస్టడీలో మరణం తర్వాత 20223లో జరిగిన ఆందోళనలు వంటి గత ప్రధాన నిరసన తరంగాలను గుర్తుచేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa