ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాక్స్‌గామ్ లోయ వివాదం.. భారత్ అభ్యంతరాలు.. కవ్వింపు ధోరణిలో చైనా బదులు

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:58 PM

జమ్మూ కశ్మీర్‌లోని షాక్స్‌గమ్ లోయ విషయంలో చైనా వైఖరితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ లోయపై అవాస్తవమైన భౌగోళిక వాదనలను డ్రాగన్ పునరుద్ఘాటించింది. అక్కడ చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివాదాలకు అతీతమైనవి అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అది తమ భూభాగమని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత్ హెచ్చరించిన మర్నాడే చైనా పైవిధంగా స్పందించింది.


షాక్స్‌గమ్ లోయ .. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులకు ఉత్తరాన, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు దక్షిణంగా ఉంది. ఇది కారకోరం పర్వత శ్రేణికి ఉత్తరాన, వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎత్తైన లోయ. 1963లో.. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగంలో 5,180 చదరపు కిలోమీటర్ల షాక్స్‌గమ్ లోయను చైనాకు అప్పగించింది.


‘మీరు ప్రస్తావించిన భూభాగం చైనాలో భాగం’ అని బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మావో నింగ్ తెలిపారు. ‘మా భూభాగంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ఆరోపణలకు అతీతమైనవి’ అని ఆమె అన్నారు. 1960ల నుంచే చైనా, పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం చేసుకున్నాయని, ఇరు దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించాయని మావో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాలుగా పాకిస్థాన్, చైనా హక్కులని ఆమె తెలిపారు.


అయితే, చైనా- పాకిస్థాన్ 1963 ఒప్పందంలోని ఆర్టికల్ 6 ప్రకారం.. ‘కశ్మీర్ వివాదం పరిష్కారం తర్వాత సంబంధిత సార్వభౌమ అధికారం ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 2లో వివరించిన సరిహద్దుపై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వంతో చర్చలు తిరిగి ప్రారంభిస్తుంది.. తద్వారా ప్రస్తుత ఒప్పందానికి బదులుగా అధికారిక సరిహద్దు ఒప్పందంపై సంతకం చేస్తుంది అని స్పష్టంగా ఉంది.


చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)పై భారత్ విమర్శలకు మావోనింగ్ స్పందిస్తూ..ఇది స్థానిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచే ఆర్థిక కార్యక్రమమనే చైనా వాదనను పునరావృతం చేశారు. ‘ఇటువంటి ఒప్పందం, CPEC కశ్మీర్ సమస్యపై చైనా వైఖరిని ప్రభావితం చేయదు, ఈ విషయంలో చైనా వైఖరి మారదు అని మావో అన్నారు.


‘‘షాక్స్‌గమ్ లోయ భారత భూభాగం. 1963లో కుదిరిన చైనా-పాకిస్థాన్ 'సరిహద్దు ఒప్పందాన్ని' మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఆ ఒప్పందం చట్టవిరుద్ధమైందని, చెల్లబాటుకాదని మేము స్థిరంగా చెబుతున్నాం’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం తెలిపారు. ‘పాకిస్థాన్ బలవంతంగా, అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగం గుండా వెళ్లే చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను కూడా మేము గుర్తించం’ అని ఆయన అన్నారు.


జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, ఈ విషయాన్ని చైనా, పాకిస్థాన్‌లకు న్యూఢిల్లీ స్థిరంగా తెలియజేస్తోందని ఆయన తెలిపారు. ‘మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.


భారత్ పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, చైనా షాక్స్‌గమ్ లోయ వద్ద మౌలిక సౌకర్యాల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు నివేదికలున్నాయి. 2017లో డోక్లామ్‌ ప్రతిష్టంభన తర్వాత షాక్స్‌గమ్‌లో చైనా నిర్మాణ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ కొత్త రహదారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్‌కు 49 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. 2021లో, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాతో కొత్త భూ సరిహద్దు క్రాసింగ్‌లను నిర్మించాలని పాకిస్థాన్ చూస్తోందని, ఇది లడఖ్, మిగతా కశ్మీర్‌లోని భారత దళాలకు వ్యతిరేకంగా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa