ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ గడ్డపై కాంగ్రెస్ కొత్త స్కెచ్,,,,విజయ్ 'జననాయగన్ ' వివాదంలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:25 PM

తమిళనాట ‘దళపతి’గా పేరుగాంచిన విజయ్.. తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ తరుణంలో ఆయన నటించిన ఆఖరి సినిమా ‘జన నాయగన్’ సెన్సార్ బోర్డు అడ్డంకులను ఎదుర్కోవడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "జన నాయగన్ చిత్రాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి" అని అభివర్ణించారు. "మిస్టర్ మోదీ.. తమిళ ప్రజల గొంతును మీరు ఎప్పటికీ నొక్కలేరు" అంటూ రాహుల్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.


సినిమా వివాదం.. రాజకీయ మలుపు


నిజానికి ‘జన నాయగన్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సీన్లు ఉన్నాయని.. సాయుధ దళాల చిత్రీకరణ సరిగ్గా లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికేట్ నిలిచిపోయింది. దీనిపై మద్రాస్ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సింగిల్ జడ్జి బెంచ్ ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినా.. డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. అయితే రాజ్యాంగబద్ధమైన సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న తన ప్రధాన రాజకీయ వాదనకు విజయ్ సినిమా వివాదాన్ని రాహుల్ గాంధీ వాడుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.


 కాంగ్రెస్ సరికొత్త స్కెచ్..?


రాహుల్ గాంధీ ప్రకటన వెనుక కేవలం కళా స్వేచ్ఛ మాత్రమే కాకుండా లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ బలమైన కూటమిలో ఉంది. కానీ విజయ్ పార్టీ టీవీకేకు యువతలో ఉన్న ఆదరణను చూసి కాంగ్రెస్ లోని ఒక వర్గం నేతలు విజయ్‌తో దోస్తీకి ఉత్సాహం చూపుతున్నారు. డీఎంకేతో దశాబ్దాల బంధం ఉన్నప్పటికీ.. విజయ్ క్రేజ్ రాబోయే ఎన్నికల్లో కీలకం కానుందని కాంగ్రెస్ అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే రాహుల్ గాంధీ-విజయ్ జోడీ యువతను భారీగా ఆకర్షించే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.


అయితే డీఎంకే వంటి నమ్మకమైన మిత్రుడిని వదులుకోవడం ప్రమాదకరమని కొందరు కాంగ్రెస్ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. విజయ్ పార్టీతో కొత్త ప్రయోగం చేయడం కంటే.. ప్రస్తుత కూటమిలోనే ఉంటూ అధికారంలో వాటా కోసం పట్టుబట్టడం మేలని వారు భావిస్తున్నారు. ఈ సందిగ్ధత మధ్య, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకోనుంది. ఆ తర్వాతే విజయ్‌తో పొత్తు ఉంటుందా లేక డీఎంకేతోనే కొనసాగుతారా అన్నది స్పష్టమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa