అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. వైసీ పల్లి గ్రామానికి చెందిన సుంకమ్మను.. ఆమె కొడుకు వెంకటేష్ సుత్తితో కొట్టి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. అయితే సుంకమ్మ హత్య కేసుకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్థానికులు రాజకీయ కారణాలు చెప్తుండగా.. మరికొంతమంది మాత్రం కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు చెప్తున్నారు.
స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం.. మే 13న ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుంకమ్మ కూడా ఓటుహక్కు వినియోగించుకుంది. అయితే అదేరోజు సుంకమ్మ తన కొడుకు వెంకటేష్‌తో వైసీపీకి ఓటు వేసినట్లు చెప్పింది. అయితే వెంకటేష్‌కు తెలుగుదేశం పార్టీపై అభిమానమని.. దీంతో తల్లీకొడుకు మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. వైసీపీకి ఎందుకు ఓటువేశావంటూ తల్లితో గొడవపడిన వెంకటేష్.. అదే ఆవేశంలో సుత్తితో కొట్టి హత్యచేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఘటన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అయితే మరికొంతమంది స్థానికులు మాత్రం.. కుటుంబకలహాలతోనే తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగిందంటున్నారు. ఆ ఆవేశంలోనే వెంకటేష్ సుత్తితో సుంకమ్మ మీద దాడి చేశాడని.. ఈ ఘటనలో సుంకమ్మ చనిపోయిందంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిజంగానే వైసీపీకి ఓటువేసినందుకు వెంకటేష్ తల్లిని హత్యచేశాడా అనేది తేలాలంటే పరారీలో ఉన్న వెంకటేష్ పోలీసులకు చిక్కాలి. వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. విచారణలో అసలు నిజమేంటో తెలియనుంది.