అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెనుదుమారం రేపారు. వెనిజులాలో నెలకొన్న అనిశ్చితి మధ్య ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వికీపీడియా పేజీని పోలి ఉన్న ఒక ఎడిటెడ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ ఈ ప్రకటన చేశారు. ఆ ఫొటోలో 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు ఉండటంతో ఇప్పుడిది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
అసలేం జరిగుతుందంటే..?
గత కొద్ది రోజులుగా వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే నెపంతో అమెరికా బలగాలు ఇటీవల వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుని వాషింగ్టన్కు తరలించింది. ఈ పరిణామం లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మదురో నిర్బంధం తర్వాత వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వెనిజులా తదుపరి పూర్తిస్థాయి నాయకుడు ఎవరనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.
వాస్తవానికి వెనిజులా విపక్ష నేత, నోబెల్ విజేత మరియా కొరినా మచాడోను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని అందరూ భావించారు. కానీ ట్రంప్ ఆమె పట్ల విముఖత చూపడం గమనార్హం. మచాడోకు ప్రజల్లో తగినంత మద్దతు లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తానే వెనిజులా బాధ్యతలు చూస్తానన్నట్లుగా ట్రంప్ పోస్ట్ చేయడం కొత్త దౌత్య వివాదానికి దారితీసింది.
అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు
ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో అరుదైన విషయం. ఇది కేవలం ట్రంప్ మార్కు హాస్యాస్పద పోస్టా? లేక వెనిజులాను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు అమెరికా వేస్తున్న వ్యూహమా? అన్నది అర్థం కాక దౌత్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఏకంగా దేశ అధికార పగ్గాలు తనవే అనడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa