వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో.. భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ఛార్జీల విధానాన్ని నిబంధనలను విడుదల చేసింది. వజనవరి 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుండగా.. 18వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గువహటి మార్గంలో పరుగులు తీయనుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి టికెట్ రూల్స్‌ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.
రైల్వే ప్రయాణాల్లో సాధారణంగా కనిపించే ఆర్‌ఏసీ విధానం ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఉండదు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించాలంటే కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్‌ఏసీ టికెట్లు ఇవ్వరని తేల్చి చెప్పారు. సాధారణంగా ఆర్‌ఏసీ టికెట్ ఉంటే ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్‌లో ఈ ఇబ్బంది లేకుండా వాటిని రద్దు చేసింది.
కనిష్ట ఛార్జీ
అయితే ఈ వందే భారత్ స్లీపర్ రైలులో 50 కిలోమీటర్లు ప్రయాణించినా లేదా 100 కిలోమీటర్లు ప్రయాణించినా.. 400 కిలోమీటర్ల దూరానికి సమానమైన టికెట్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో 3 ఏసీ టికెట్ ధర రూ.960 గా నిర్ణయించారు. అదే 2 ఏసీ అయితే రూ.1,240.. 1 ఏసీ అయితే రూ.1,520 గా వసూలు చేయనున్నారు. ఈ టికెట్ ధరకు అదనంగా జీఎస్టీ కూడా వేయనున్నారు.
రాజధాని, వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీల పోలిక
వందే భారత్ స్లీపర్ ఛార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కంటే దాదాపు 10 శాతం నుంచి 15 శాతం ఎక్కువగా ఉన్నాయి.
క్లాస్ వందే భారత్ (ప్రతీ కిలోమీటర్‌కు) రాజధాని (ప్రతీ కిలోమీటర్‌కు)
3AC రూ.2.4 రూ.2.10 - రూ.2.14
2AC రూ.3.1 రూ.2.85 - రూ.2.91
1AC రూ.3.8 రూ.3.53 - రూ.3.60
ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీని వసూలు చేస్తారు.
హౌరా - గువహటి ప్రయాణ వివరాలు
మొదటి వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
ఛార్జీలు
3 ఏసీ - రూ.2,300
2 ఏసీ - రూ.3,000
1ఏసీ - రూ.3,600
ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చితే హౌరా నుంచి గువహటికి 3 గంటలు వేగంగా ఈ ప్రయాణం పూర్తవుతుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.
ప్రత్యేక ఫీచర్లు
రైలు ప్రమాదాలను నివారించే అత్యాధునిక ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయిన కవచ్ వ్యవస్థను ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఉపయోగిస్తున్నారు. కోచ్ లోపల శబ్దం రాకుండా ప్రత్యేక ఇన్సులేషన్ ఏర్పాటు చేశారు. స్టేషన్ రాగానే వాటంతట అవే తెరుచుకునే, మూసుకునే తలుపులను ఉంచారు. వ్యాక్యూమ్ టెక్నాలజీతో కూడిన ఆధునిక వాష్‌రూమ్‌లు ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa