ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ అనంతరం హింస చెలరేగటంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఏపీలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాలకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలి, తిరుపతి జిల్లాక హర్షవర్ధన్‌ను ఎస్పీలుగా నియమించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీ నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 13వ తేదీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్రశాంతంగా సాగగా.. మధ్యాహ్నం నుంచి పల్నాడు జిల్లా సహా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ రోజుతో పాటు ఆ మరుసటి రోజు సైతం పల్నాడు, మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. టీడీపీ, వైసీపీ రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవటంతో ఈ ప్రాంతాల్లో హైటెన్షన్ ఏర్పడింది.
మరోవైపు హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీలను దీనిపై వివరణ కోరింది. వారితో భేటీ తర్వాత.. ఘర్షణలు చెలరేగిన తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.
పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్‌ను సైతం బదిలీ చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణకు సైతం ఆదేశించింది. ఈ క్రమంలోనే వారి స్థానంలో పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా బాలాజీని నియమించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.