ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు తయారైంది ఏపీవాసుల పరిస్థితి. ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో.. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అయితే బాటిళ్లల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకూడదని గతంలోనూ పోలీసుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పలు ఘటనల నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకూడదని పోలీసులు గతంలోనూ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ.. వాహనాదారులు ఇన్నిరోజులూ కొనుగోలు చేస్తూ వచ్చారు.
అయితే ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఈ విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులు నిర్ణయించారు. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దంటూ ఇప్పటికే పెట్రోల్ బంకుల యాజమాన్యాలను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకోవటం పోలీసులను కలవరపరిచింది. అలాగే ఓ రాజకీయ నేత ఇంట్లో భారీగా పెట్రోల్ బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీస్ శాఖ కూడా బాటిళ్లలో పెట్రోల్ విక్రయించవద్దంటూ పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అయితే వాహనంలో పెట్రోల్ ఖాళీ అయినప్పుడు ఏంటి పరిస్థితి అని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలోని పల్నాడు జిల్లా, మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల్లో పోలింగ్ తర్వాత హింస చెలరేగింది. మే 13వ తేదీ మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి,. తాడిపత్రిలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అటు చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై దాడికి పాల్పడగా.. పులివర్తి నానికి గాయాలయ్యారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురు అధికారులపై సైతం వేటువేసింది.