పదో తరగతి అనేది విద్యార్థుల బంగారు భవితకు తొలిమెట్టు. వారి కెరీర్ దశ, దిశను నిర్ణయించేది, నిర్దేశించేదీ పదో తరగతి. అందుకే పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వారిని ప్రోత్సహించేందుకు, మెరుగ్గా రాణించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే ఆయనేమీ ఉపాధ్యాయుడు కాదు.. అలాగని ఏ స్కూలో ఓనరో కూడా కాదు. కానీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు, పేద విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకునే.. పదిలో మంచి మార్కులు సాధించిన వారికి బంపరాఫర్ ఇచ్చారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మందనపాలెనికి చెందిన ఉమాపతి మాట నిలబెట్టుకున్నారు. నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని ఉమాపతి గతంలో ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను విమానంలో తిప్పారు ఉమాపతి. పదో తరగతిలో ఐదువందల మార్కులకు పైగా సాధించిన నలుగురు గవర్నమెంట్ స్కూలు విద్యార్థులను తనతో పాటుగా చెన్నై నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువచ్చారు. పురుషోత్తం (552 మార్కులు) విష్ణు (515), మహా (509), తనూజ( 504) అనే నలుగురు విద్యార్థులను, వారి స్కూల్ హెడ్మా్స్టర్తో పాటుగా మే17వ తేదీ.. చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు ఉమాపతి.
ఇక వీరంతా హైదరాబాద్లో రెండురోజుల పాటు ఉండనున్నారు. ఈ రెండు రోజులు సిటీ మొత్తం తిప్పి ఇక్కడున్న విశేషాలను వారికి చూపించనున్నారు. ఈ టూర్కు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతి భరించనున్నారు. విద్యార్థులను తిరిగి వాళ్ల ఇంటి వద్ద దిగబెట్టే వరకూ మొత్తం ఖర్చును భరించనున్నారు. మరోవైపు ఉమాపతి చేస్తున్న పనిని పలువురు అభినందిస్తున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు. విమానం ఎక్కాలనే కోరికతో.. విద్యార్థులు మరింత పట్టుదలగా చదువుతారని.. ఉమాపతి ఆశయం కారణంగా.. చిన్నారుల కోరిక తీరడంతో పాటుగా మంచి మార్కులు సాధించడం ద్వారా వారి తల్లిదండ్రులు కూడా సంతోషపడతారని అభిప్రాయపడుతున్నారు.