మండే ఎండల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆహ్లాదం పొందుతున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో మాత్రం ప్రజలు పొలాలకు పోటెత్తున్నారు. పొలం పనుల కోసం కాదు.. వజ్రాల వేట మొదలుపెట్టారు. ఏటా తొలకరి వానల ప్రారంభంతోనే ఇక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. ఈసారి వేసవిలోనే ఆ వేట ప్రారంభమైంది. తుగ్గలి మండలం జొన్నగిరికి ఎక్కడెక్కడి నుంచో జనం తరలివస్తున్నారు. ఉదయం నుంచే వజ్రాల అన్వేషణలో బిజీగా ఉన్నారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో రెండు రోజులుగా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, జీవితం మారిపోదా అనే ఆశ వారిని ఆ కష్టం మర్చిపోయేలా చేస్తోంది. అయితే, రైతులు మాత్రం తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమ పొలాల వైపు వజ్రాల వేట కోసం రావొద్దని కొంత మంది రైతులు బోర్డులు ఏర్పాటు చేశారు. గతేడాది చాలా మందికి వజ్రాలు దొరికాయి. స్థానిక వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి వాటిని సొంతం కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు.