ఏపీలో సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అనంతర పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్ బాంబులు(పెట్రోల్ బాటిల్స్)తో దాడి చేసినఉదంతాలు బయటపడటంతో పెట్రోల్ బంకుల డీలర్లకు పోలీసు, ఎన్నికల ఉన్నతాధికారులు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే ఆయిల్ పోసేలా.. బాటిళ్లు, క్యాన్లలో ఆయిల్ పోయకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటించే లా బంకుల డీలర్లకు ఆదేశాలు జారీ చే శారు. ‘ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్ అమ్మబడుదు’ అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు.