తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీ ప్రాంగణంలో మారణాయుధాలు బయటపడ్డాయి. కాంపౌండ్ వాల్ దగ్గర ఐరన్ రాడ్స్, హాకీ స్టిక్స్, కత్తులను బాంబ్ డిస్పోజల్ టీమ్ గుర్తించింది. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలోకి మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై ఆరా తీస్తున్నారు.
మరోవైపు పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను భద్రపరిచారు. అయితే స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఇటీవల కొంతమంది దాడి చేశారు. కర్రలు, రాళ్లు, ఐరన్ రాడ్లతో పులివర్తి నాని కారు మీద దాడి చేశారు. ఈ ఘటనలో పులివర్తి నాని భుజానికి గాయంకాగా.. ఆయన గన్‌మెన్ తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పులివర్తి నానికి మద్దతుగా టీడీపీ మహిళా నేతలు నిరసనకు దిగటంతో పద్మావతి యూనివర్సిటీలో ఇటీవల హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక చంద్రగిరితో పాటుగా తాడిపత్రి, పల్నాడు, నర్సరావుపేట ప్రాంతాల్లో కూడా పోలింగ్ అనంతరం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు ఇప్పటికే పూర్తికాగా.. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. తాజాగా.. తిరుపతి జిల్లాలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు పర్యటించారు. ఘర్షణలపై పలువురిని విచారించారు.
తిరుపతిలోనూ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగింది. ఎస్వీయూ క్యాంపస్ పోలీసు స్టేషన్‌లోనూ సిట్ అధికారులు కేసులను పరిశీలించారు. ఘర్షణలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ బృందం విచారణ చేపట్టింది.