ఏపీవాసులకు వాతావరణశాఖ ఊరటనిచ్చే వార్త వినిపించింది. మే 22 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం.. ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు ఆదివారం సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలోనూ ఏపీవాసులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయన్న వాతావరణశాఖ.. ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. ఆదివారం నాటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.