విజయనగరం జిల్లా, శృంగవరపుకోట మండలంలోని వెంకటమరణపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బొబ్బిలి అప్పలస్వామి (25) ఆదివారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందాడు. అప్పలస్వామి ఎప్పటిలాగే ఆదివారం ఉదయం 6 గంటలకు మేకలు తోలుకొని గ్రామంలో కంచిపాటి రాము క్వారీ సమీపంలో ఉన్న మెట్ట వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో ఇంటికి మేకలు చేరుకున్నా అప్పలస్వామి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా మెట్టపై పిడుగుపాటుకు మృతిచెంది ఉన్నాడు. అప్పలస్వామికి తల్లిదండ్రులు, భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.