వారు నిరుపేదలు. ఏరోజుకారోజు కూలి చేసుకుని పొట్టపోసుకునే దళిత దంపతులు. కష్టంలోనూ, సుఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండే ఆలూమగలు. వారిని విద్యుత్ రూపంలో మృత్యువు కాటేసింది. ప్రమాదవశాత్తూ భార్యకు కరెంటు షాక్ తగలడంతో ఆమెను కాపాడబోయిన భర్త కూడా షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా, గంపలగూడెం దళితవాడలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గంపలగూడెం దళితవాడకు చెందిన గోరట్ల తిరుపతయ్య (62), భార్య గోరట్ల జమలమ్మ (55) కూలి పని చేసి జీవనం సాగిస్తుంటారు. ఎప్పటిలానే పనికెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రి సమయంలో చిరుజల్లులు పడుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొంత సమయం తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఆ సమయంలో ఇంటికి కరెంటు సరఫరా అవుతున్న సర్వీస్ తీగను ఇంటి లోపల బట్టలు ఆరేసుకునే జీఏ వైర్ తగిలింది. దీన్ని గమనించక జమలమ్మ వైర్‌పై ఉన్న బట్టలు తీస్తుండగా కరెంటు షాక్‌కు గురై పెద్దగా కేక వేసింది. అది విన్న భర్త తిరుపతయ్య పరుగున వచ్చి ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దళితవాడలో విషాద చాయలు అలుముకున్నాయి.