పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల సిట్ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలో నరసరావుపేట ఒకటో పట్టణం, రూరల్, మాచర్ల నియోజకవర్గం కారంపూడి, గురజాల నియోజకవర్గం దాచేపల్లి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, హింసాత్మక సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సిట్ సభ్యులు పరిశీలించారు. జరిగిన అరాచక సంఘటనలపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన సెక్షన్లు, ఎంత మందిపై కేసులు నమోదు చేశారో వివరాలు సేకరించారు. కారంపూడిలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి స్వయంగా దాడులు చేయించారు. మారణాయుధాలతో స్వైరవిహారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను సిట్ పరిశీలించింది. నరసరావుపేట మండలం దొండపాడులో వైపీపీ మూకలు ఎంపీ, టీడీపీ లోక్‌సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై దాడి చేశాయి. రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. సిట్ సభ్యులు ఈ వివరాలనూ సేకరించారు. నరసరావుపేట దాడులకు సంబంధించి పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయకపోవడాన్ని గుర్తించినట్లు సమాచారం. దాచేపల్లి మండలం తంగెడలో పోలింగ్ కేంద్రంపై వైసీపీ గూండాలు పెట్రోలు బాంబులతో దాడులు చేశారు. 13 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినా.. తేలికపాటి సెక్షన్లు నమోదుచేసినట్లు తెలిసింది. ఇరికేపల్లిలో జరిగిన అల్లర్లపై దాచేపల్లి స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లను సిట్ సభ్యులు పరిశీలించారు. జిల్లాలో హింసాత్మక సంఘటనలపై స్థానిక అధికారుల వైఫల్యాలపై కూడా వారు ప్రశ్నించినట్లు తెలిసింది.