ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ ఉత్సవాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చే నెలకు వాయిదా పడినప్పటికీ ఆదివారం మాత్రం పాడేరులో పండగ సందడి నెలకొంది. వాస్తవానికి ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండడంతో వారం, పది రోజుల కిత్రమే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానికుల బంధువులు ఇక్కడికి వచ్చారు. అలాగే వారి మొక్కులను సైతం తీర్చుకున్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు భావిస్తాడు. దీంతో అధికారికంగా ఉత్సవాలు వాయిదా పడినప్పటికీ స్థానికంగా ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మోదకొండమ్మ దర్శనానికి ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయం లోపల నుంచి రోడ్డుపైకి సైతం భక్తులు వరుస కట్టారు. అలాగే మొక్కలున్న భక్తులు ఘటాలను అమ్మవారికి సమర్పించారు. దీంతో పాడేరు పట్టణంతో పాటు మోదకొండమ్మ ఆలయం ఆవరణలోనూ ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులకు ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రసాదాలు పంపిణీ చేశారు.