తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) చనిపోయారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హాస్పటల్లో చేరారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు కృష్ణ బాబు తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కృష్ణబాబు మృతదేహాన్ని ఆయన స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు కుటుంబ సభ్యులు. బుధవారం నాడు అత్యంతక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.కాగా, టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు అయిన పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత టీడీపీ నుంచి టీవీ రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన జవహార్ మంత్రి కూడా అయ్యారు. అయితే, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా.. పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి. ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి ఉంటుంది.