ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన విధ్వంసంపై నమోదైన కేసుల్లో పోలీసు శాఖ బలమైన ఐపీసీ సెక్షన్లు చేర్చింది. దాడులకు పాల్పడిన నిందితులపై హత్యాయత్నం(ఐపీసీ 307), కుట్ర కోణం(120బీ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఆయా జిల్లాల్లోని కోర్టుల్లో మంగళవారం మెమో దాఖలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, గురజాలల్లో 22, తిరుపతి జిల్లా చంద్రగిరి, తిరుపతిలో 4, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదవగా వాటిలో స్థానిక పోలీసులు బలమైన సెక్షన్లు చేర్చలేదు. ప్రజా ప్రతినిధుల సిఫారసుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్షేత్రస్థాయిలో పర్యటించి దాడుల తీవ్రతను, అక్కడ లభ్యమైన ఆధారాలను పరిశీలించిన తర్వాత హత్యాయత్నం సెక్షన్ల నమోదుకు సిఫారసు చేసింది.