మిరపతోటలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేసి.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విక్రయిస్తున్న అన్నదమ్ముల గుట్టును కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం రూ.2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని బళ్లారి నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతుండటంతో అక్కడి పోలీసులు నిఘా ఉంచారు. గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులను తమదైన శైలిలో విచారించగా, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకూడ్లూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు రవి, చంద్ర ద్వారా తాము గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో కర్ణాటక పోలీసులు మంగళవారం సంతేకూడ్లూరుకు వచ్చి రవి, చంద్రల ఇంటిని సోదా చేయగా 50 కిలోల గంజాయి బస్తాలు కనిపించాయి. వాటి విలువ రూ.2 కోట్లుగా పోలీసులు తెలిపారు. రవి, చంద్రలను అరెస్టు చేశారు. రవి, చంద్ర గత కొన్నేళ్లుగా తమ మిరప తోటలో గంజాయి మొక్కలను గుట్టుగా సాగు చేస్తున్నట్టు గుర్తించారు. గంజాయి మొక్కలున్న ప్రాంతానికి కూలీలు, ఇతరులెవరూ వెళ్లకుండా వారు జాగ్రత్త పడినట్టు సమాచారం. ఆ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది.