తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి ఆగస్టు నెలకు సంబంధించి రూ.300 టికెట్లు, వసతి గదులు ఆన్‌లైన కోటా విడుదలకానున్నాయి. గురువారం (మే 23న) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదే రోజు (మే 23) ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. గురువారం రోజు (మే 23)న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఈ నెల 24న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అంతేకాదు అదే రోజు (మే 24న) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటాను మే 27 (సోమవారం)న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తరిగొండ వెంగమాంబ తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని జేఈవో శ్రీమతి గౌతమి ఉద్ఘాటించారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు జేఈవో గౌతమి. వెంగమాంబ సాహిత్యాన్ని, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ముత్యాల హారతి రూపంలో శ్రీవారిలో ఐక్యమైనారన్నారు.
వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు అనంతపురం ఎస్‌కే వర్సిటీ మాజీ వీసీ డా.కుసుమకుమారి. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, రచనలను వెలుగులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. సంఘసంస్కర్తగా, భక్తిని ఆయుధంగా చేసుకొని ఎన్నో రచనలు చేశారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా జనరంజకమైన భాషలో వెంగమాంబ రచనలు చేశారని తెలిపారు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర. వెంగమాంబ పాటలు సామాన్య జనులు పాడుకునే విధంగా వుంటాయన్నారు. ప్రతి పాటలో భక్తి మరియు చైతన్య వంతమైన భావాలు కనిపిస్తాయన్నారు.
వెంగమాంబ సాహిత్యంలో భక్తి అనేది ప్రత్యేకంగా కనిపింస్తుందన్నారు నెల్లూరుకు చెందిన ప్రాచీన విశిష్ఠ అధ్యయన కేంద్రం డా. లోకేశ్వరి. మానవ జీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని తెలిపారు. వెంగమాంబ రచనల్లో ప్రాచీన సాహిత్యం, ఆనాటి సామాజిక, భాషా, సాంస్కృతిక విశేషాలు తెలుసుకోవచ్చన్నారు. రచనలలో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు వివరించారు. వెంగమాంబ ద్విపద రచనలు, యక్షగానాలు, పద్యాలు, పాటలు వంటి విభిన్న ప్రక్రియలు రాసి అందరి మన్నలలు పొందారన్నారు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ళ విభీషణ శర్మ. వెంగమాంబ మొత్తం 18 రచనలు చేయగా, ఇందులో శ్రీ వేంకటాచల మహత్యం గ్రంథం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం తరిగొండ వంశీయులు శ్రీ విష్ణుమూర్తి, నాగరాజురావు, సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఎస్వీబిసి ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర, హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించారు.