ఏలూరు జిల్లాలో కల్తీ కూల్ డ్రింక్‌ల వ్యవహారం కలకలంరేపింది. మండవల్లి సమీపంలో కల్తీ కూల్ డ్రింక్‌లు తయారు చేస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్లారు. లోకుమూడికి గ్రామానికి చెందిన కాగిత రామకృష్ణ అనధికారికంగా కొన్ని పెద్ద కంపెనీల బ్రాండ్లతో కల్తీ కూల్‌డ్రింక్స్ తయారు చేస్తూ షాపులకు విక్రయిస్తున్నాడు. అతడిపై ఫిర్యాదులు రావడంతో ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్ డ్రింక్స్ తయారీ కేంద్రంపై దాడులు చేశారు. కూల్ డ్రింక్‌లు తయారు చేస్తున్న కేంద్రంలో సోదాలు చేశారు.
అక్కడ కూల్‌డ్రింక్స్ తయారీకి కావాల్సిన కెమికల్స్, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కూల్ డ్రింక్‌లకు గడువు తీరినట్లు గుర్తించారు.. కొన్ని బాటిల్స్ గుర్తించి శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ సెంటర్లకు పంపించారు. అంతేకాదు ఈ తయారీ కేంద్రానికి తూనికలు, కొలతల శాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు అధికారులు. ఈ వ్యవహారంపై పలు సెక్షన్ల కింద యజమాని రామకృష్ణపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ తెలియజేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, తూనికలు కొలతల అధికారులు పాల్గొన్నారు. ఎండాకాలం కావడంతో ఎక్కువమంది జనాలు కూల్ డ్రింక్‌లు తాగుతారు.. ఇలాంటి కల్తీ కూల్ డ్రింక్‌లు తాగితే నేరుగా ఆస్పత్రిలో చేరడమే అంటున్నారు. ఇలాంటి నకిలీ కూల్ డ్రింక్‌ల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు.