సోషల్ మీడియా ప్రేమలు ప్రస్తుతం ఎక్కువవుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయాలు కాస్తా.. బంధాలుగా మారి పెళ్లిళ్లు చేసుకోవడం, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండటం ఇటీవలి కాలంలో పెరిగిపోవడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు కొన్ని రోజులకే ముగిసిపోవడం.. లేదా ఆత్మహత్యలకు పాల్పడటం, హత్యలు చేయడం వంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి ఆన్‌లైన్ ప్రేమల్లో వింత వింత రకాల పోకడలు రోజురోజుకూ బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన కంటే తక్కువ వయసు ఉన్న బాలుడిని ప్రేమించిన ఓ యువతి అతని ఇంటికే వచ్చి తిష్ట వేసిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 25 ఏళ్ల ఓ యువతికి.. షామ్లికి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడికి ఆన్‌లైన్‌లో పరిచయం మొదలైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. దీంతో ఆ యువతి.. ఏకంగా బాలుడి ఇంటికే వచ్చేసింది. కొన్ని రోజులు అక్కడే ఉంది. అయితే చివరికి బాలుడి తల్లిదండ్రులు.. ఆ యువతిని ఇంటికి వెళ్లిపోవాలని సూచించగా.. అందుకు నిరాకరించింది. మొదట మామూలుగానే చెప్పిన బాలుడి కుటుంబ సభ్యులు.. ఆమె వినకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువతిని తీసుకెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. ఆ యువతిని ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఆ యువతి.. తిరిగి తన మైనర్ ప్రియుడి ఇంటికి చేరుకుంది. మళ్లీ ఆమెను వెళ్లిపోవాలని బాలుడి తల్లిదండ్రులు హెచ్చరించగా.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బాలుడి కుటుంబ సభ్యులు తల పట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆ యువతి తమ ఇంట్లోనే ఉందని.. వెళ్లిపోవాలని చెప్పగా.. ఇలా బెదిరింపులకు దిగుతోందని బాలుడి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే మొదట స్థానిక పోలీసులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి షామ్లి జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు పంచాయితీ వెళ్లింది. తమ కుమారుడు చదువుకోలేదని.. ఏ పని చేయడని బాలుడి తండ్రి మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. తన కుమారుడికి, ఆ యువతికి సోషల్ మీడియాలో పరిచయం అయిందని.. అయితే ఆమె తమ ఇంట్లోనే ఉంటోందని.. బయటికి వెళ్లమంటే చనిపోతానని బెదిరిస్తోందని ఆ బాలుడి కుమారుడు మేజిస్ట్రేట్‌కు వివరించాడు.
ఆ యువతిని మొదట వారి కుటుంబ సభ్యులకు అప్పగించినా.. ఆమె తమకు చెడ్డపేరు తీసుకువచ్చిందని భావించిన వారు.. ఆ యువతిని తిరిగి ఇంట్లో ఉంచుకునేందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. మైనర్‌తో కలిసి ఉండాలని ఆ యువతి పట్టుబడుతోందని పోలీసులు తెలిపారు. అయితే మహిళా సంక్షేమ విభాగానికి ఆ యువతిని పంపించినా.. ఆమె తిరిగి మళ్లీ వచ్చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని.. వారు ఆమెను తీసుకెళ్లకపోతే, మహిళా షెల్టర్ హోమ్‌కు పంపిస్తామని చెప్పారు.