తల్లిదండ్రుల ఆస్తులనే కాదు.. వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వారు అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా కావచ్చని ఓ న్యాయస్థానం తీర్పు చెప్పింది. తండ్రి చనిపోవడంతో ఒంటరిగా ఉన్న తల్లిని తన ఇంటికి ఆహ్వానించి.. ఆమె పేరుతో ఉన్న ఆస్తులను లాక్కుని గెంటేసిన కుమార్తెకు కోర్టు దిమ్మదిరిగేలా ఆదేశాలు వెల్లడించింది. కన్నవారి ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కోర్టు ఓ కేసులో తీరు వెలువరించింది. వయసు మళ్లిన తల్లికి జీవనభృతి కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది. ఈ మేరకు అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. 78 ఏళ్ల మహిళ.. తన కుమార్తె (55)పై కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏకైక సంతానమైన తన కుమార్తె కోవిడ్ సమయంలో ఇంటి నుంచి తరిమేసిందని ఆ వృద్ధురాలు ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసిన ఆమె భర్త 2001లో మరణించాడు. దీంతో ఒంటరిగా ఉన్న తల్లిని తన ఇంటికి కుమార్తె ఆహ్వానించింది. అయితే, తల్లికి వారసత్వంగా సంక్రమించిన ఇంటిని అమ్మించి.. ఆ డబ్బులను తీసుకుంది. అలాగే, తండ్రి ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బునూ కొంచెం కొంచెం డ్రా చేయించి దానిని కూడా లాగేసుకుంది.
ఈ క్రమంలో 2020 మార్చిలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పుడు తల్లిని చిత్రహింసలకు గురిచేసింది. అనంతరం ఆమెను ఇంట్లో నుంచి తరిమేసింది. కుమార్తె మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఆ తల్లి న్యాయపోరాటానికి దిగింది. తనకు ఉండటానికి ఇల్లే కాదు.. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయింది. తన కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు సంపాదిస్తోందని, ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలని పిటిషన్‌లో వృద్ధురాలు పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మాయ విశ్వలాల్.. తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని నిర్దారించారు. ఆ వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించారు.