పొన్నూరు శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భవనారాయణ స్వామి దివ్య రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జామున స్వామి వారి బ్రహోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ పూజలో ఆలయ అనువంసిక ధర్మకర్త రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ బహద్దూర్ మన్నే సుల్తాన్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం గురువారం ఉదయం స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి గరుడ వాహనంపై పట్టణ వీధుల్లో విహరించారు. సాయంత్రం ఆలయం వద్ద రథానికి ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వక్షేనారాధన, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. సంప్రదాయం ప్రకారం నిడుబ్రోలుకు చెందిన మేజర్ పీటీ చౌదరి రథం వద్ద స్వామి వారికి తోలి పూజలు నిర్వహించి అర్చక స్వాముల ఆశీర్వాచనాలు అందుకున్నారు. ఆలయ అనువంశక ధర్మకర్త రాజా సుధా స్వరూప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వైసీపీ ఎంపి అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మండేపూడి పానకాల రావు, తహసీల్దార్ సూర్యనారాయణ సింగ్ రథానికి పూజలు చేసిన అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల నడుమ రథోత్సవం ముందుకు సాగింది. పట్టణ వీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. అర్బన్, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 గంటలకు పైగా వాహనంపై స్వామి వారు జీబీసీ రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్ కసుకర్రు రోడ్డులో విహరించి తిరిగి ఆలయం వద్దకు చేరుకోవటంతో రథోత్సవం ముగిసింది. పొన్నూరు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం స్వర్ణపూరి సేవా సంఘం పొన్నూరు బ్లడ్ వెల్‌ఫేర్ అసోసియేషన్, పలు ధార్మిక సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, దద్దోజనం, మజ్జిగ, శీతల పానీయాలను పంచిపెట్టారు.