ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోందని, పంటకాల్వ ల్లో పూడికతీత పనులు త్వరితగతిన ప్రారంభించి వాటిని పూర్తి చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉయ్యూరులో పూడుకుపోయిన పంటకాల్వలను కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వీరమాచినేని జ్యోతితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఖరీఫ్ ప్రారంభం కాబోతున్నా పంటకాల్వలు పూడికతీత, అభివృద్ధి పను లకు నోచుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గత జూలైలో కురిసిన అధిక వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి కాల్వల ద్వారా మురుగు పోక జిల్లాలో అనేక ప్రాంతాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపో యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యూరు, శివారు ప్రాంతాలు కాటూరు, కడవకొల్లు, గండిగుంట పరిధిలో రియల్ ఎస్టేట్, అపార్ట్‌మెంట్లు, నూతన భవన నిర్మాణాల వలన మురుగు కాల్వలు పూడ్చేయడంతో మురుగు పోయే మార్గం లేకుండా పోయిందన్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే మురుగు, పంటకాల్వల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి, నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కౌలురైతు సంఘం మండలాధ్యక్షుడు నెమ్మాది కనకరావు పాల్గొన్నారు.