ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీసా లేకుండా పాకిస్థాన్ వెళ్లి ఆ దేశం బలమేంటో పరిశీలించాను: నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 09:31 PM

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అధికార, విపక్షాల మధ్య పాకిస్థాన్ అంశం తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తోంది. పాక్‌ను రెచ్చగొడితే.. ఆ దేశం వద్ద ఉన్న అణుబాంబును ప్రయోగించే అవకాశం ఉందని.. చేస్తున్న ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పాక్ బలం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని.. అయితే తాను గతంలోనే వీసా లేకుండానే లాహోర్‌కు వెళ్లి.. పాక్‌ బలం ఏంటో చూశానని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ కూడా ఒకప్పుడు మన దేశంలోని భాగమేనని తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుతం దాయాది దేశం పాక్ ఆందోళలకు ప్రధాన కారణం తానేనని అన్నారు.


పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని.. ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఇటీవల కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తాను 2015 లో లాహోర్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను వ్యక్తిగతంగా పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశం ఎంత శక్తివంతమైందో పరిశీలించానని పేర్కొన్నారు.


తాను లాహోర్‌లో పర్యటించినప్పుడు.. వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చారంటూ ఒక జర్నలిస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తి చేసిన ప్రధాని.. ఆ జర్నలిస్ట్‌కు ఇచ్చిన సమాధానం వెల్లడించారు. ఒకానొక సమయంలో పాకిస్థాన్ కూడా మా భారత్‌లో భాగమే కదా అని తాను వారికి చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక ఇటీవలి కాలంలో పాక్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో పడిందని.. అయితే దానికి తాను కూడా ఓ మూలకారణమని తనకు తెలుసని చెప్పారు.


పాక్ మనకు దాయాది దేశం కాబట్టి ఆందోళన చేయడంలో అర్థం ఉంది.. కానీ భారత్‌లో కొంతమంది వ్యక్తులు.. ఆ దేశంపై సానుభూతి చూపిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబై పేలుళ్లకు పాల్పడిన కసబ్‌ మనవాడే అంటూ మరో నేత అన్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీపై నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


గురువారం పంజాబ్‌లోని పటియాలాలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్తార్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1971 లో భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధంలో 90 వేల మంది పాకిస్థాన్ సైనికులు భారత్‌కు లొంగిపోయారని.. ఒకవేళ ఆ సమయంలో తాను అధికారంలో ఉంటే ఆ సైనికులను విడుదల చేసే ముందు పాక్‌ నుంచి కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను వెనక్కి తీసుకునేవాడినని మోదీ స్పష్టం చేశారు. 2015 డిసెంబరు 25 వ తేదీన ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తిరిగి భారత్‌కు వస్తుండగా.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆకస్మికంగా దిగారు. అయితే అప్పటి పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ బర్త్ డే కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2004 తర్వాత ఓ భారత ప్రధాని పాక్‌లో అడుగుపెట్టడం అదే తొలిసారి కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com