ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన సిఫార్సులు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తి చేశారు. దీనిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తప్పుబట్టారు. దీంతో ఇజ్రాయేల్ ప్రధాని అరెస్ట్‌కు ఐసీసీ వారెంటు జారీ చేస్తుందా? ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. తీవ్రమైన యుద్ధ నేరాలు, మారణహోమం, దురాక్రమణ వంటి నేరాలపై మాత్రమే ఐసీసీ విచారణ చేపడుతుంది.
ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ ప్రాథమికంగా విచారించి... సాక్ష్యాలు ఉన్నాయని నిర్దారణకు వస్తే అరెస్టు వారెంటు జారీ చేయాలని సిఫార్సు చేస్తుంది. అనంతరం ముగ్గురు న్యాయమూర్తుల ప్రాథమిక ధర్మాసనం పరిశీలించిన విచారణార్హత, వారెంట్‌పై నిర్ణయిస్తుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెల్లడిస్తారు. దీనిపై నిందితులు సంతృప్తి చెందకపోతే... ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ ధర్మాసనం ఇచ్చే తీర్పు అంతిమం. అయితే, నిందితుల అరెస్టు, ఆస్తుల జప్తుతో పాటు తీర్పును అమలు చేయాలన్నా సభ్యదేశాలపై ఆధారపడటం తప్పించి ఐసీసీకి స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాధికారం లేదు.
గతంలో ఐసీసీ 46 అరెస్ట్ వారెంట్లు జారీచేయగా.. వారిలో 21 మందిని అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో పిల్లలను అపహరించారనే ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, సూడాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నరమేధం ఆరోపణలపై ఒమర్ అల్‌బషీర్‌కు, లిబియా మాజీ నేత గడాఫీకి ఇలాంటి అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం నెతన్యాహు, హమాస్ నేతల అరెస్టు వారెంట్‌పై ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ చేసిన విజ్ఞప్తి.. ప్రాథమిక ధర్మాసనం ముందుకు వెళుతుంది. ఇందుకు అవసరమైన ఆధారాలున్నాయా? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఆధారాలున్నాయని భావిస్తే వారెంటు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ ధర్మాసనంలో రుమేనియా, మెక్సికో, బెనిన్‌లకు చెందిన జడ్జిలు ఉన్నారు. వీరు తమ నిర్ణయం వెల్లడిండచానికి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదు. గతంలో చాలా కేసుల్లో వారెంట్లపై నిర్ణయానికి కొన్ని నెలల పాటు తీసుకున్న సందర్భాలున్నాయి.
బ్రిటిష్-లెబనీస్ లాయర్ అమల్ క్లూనీ మాత్రం ప్రస్తుత కేసులో అరెస్టు వారెంట్లు జారీ చేయటానికి తగిన సాక్ష్యాలను సేకరించి ప్రాసిక్యూషన్‌కు సహకరించినట్లు చెబుతున్నారు. వాటి ఆధారంగానే ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్‌ఖాన్... ఇజ్రాయేల్, హమాస్ నేతల అరెస్టుకు పట్టుపడుతున్నారు. అయితే, ఈ డిమాండ్‌ను ఇజ్రాయేల్‌తో పాటు హామాస్ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.