ఏలూరు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు జిల్లా అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి అన్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు ఏఎస్పీ పర్యవేక్షణలో ఏలూరు పోణంగి రోడ్డులోని వైఎస్‌ఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి రికార్డులు లేని 70 మోటారు సైకిళ్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్‌ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రబుల్ మంగర్స్, రౌడీ షీటర్లపై నిఘా నుంచి బైండోవర్ చేస్తున్నామన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. డీఎస్పీ ఈ శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్, టూటౌన్ సీఐ ప్రభాకరరావు, త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, పోలీసు అధికారులు, వంద మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.