నిద్రిస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును చోరీకి పాల్పడిన వైనమిది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా, బాడంగి పరిధిలోని ముగడ గ్రామానికి చెందిన యామల స్వాతి ఈ నెల 22న సాయంత్రం తన ఇంటికి దగ్గరలో ఉన్న మత్స అచ్చమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లింది. నిద్రపోతున్న ఆమె మెడలోని పుస్తెల తాడును కత్తిరించి... వెళ్లిపోతుండగా చున్నీ వృద్ధురాలి కాలికి తగిలింది. దీంతో మేలుకున్న అచ్చెమ్మ చోరీ విషయాన్ని గుర్తించి... కేకలు వేసింది. అప్పటికే పుస్తెలతాడు పట్టుకొని స్వాతి పరారైంది. దీనిపై అచ్చెమ్మ, ఆమె కుమారుడు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్ఐ ఆర్.జయంతి సిబ్బందితో వెళ్లి విచారించి స్వాతిని అరెస్టు చేసి సుమారు 2 తులాల పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం శుక్రవారం కోర్టుకు తరలించినట్టు తెలిపారు.