దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదు.. ఆమె అనంత శక్తి మంతురాలు.. ఈ జగానికే మాత.. శ్రీ మాతా మహారాజ్ఞి లీలలు.. చింతామణి గృహంలో కొలువైన ఆమె శోభను గురించి ఎంత వర్ణించినా తక్కువే.. సర్వకార్యాలను సులభంగా నెరవేరుస్తుంది.. నమ్మిక ఉంచి అర్చించి శరణు కోరుకున్న వారికి నిత్యం అండగా ఉంటుంది. కలియుగంలో సర్వేష్ట సాథిని ఆమె.. ఆమెను స్మరించినంత మాత్రాన భయాలుండవు.. ఈతి బాధలుండవు.. దరిద్రం దుఃఖాలు ఉండవు.. ఆమె సర్వోపకారిణి, శరణాగత దీనార్త పరాయణి దుర్గాదేవి.. ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని శ్రీమాతా వైభవం పేరిట దుర్గమ్మవారి వైభవం గురించి వివరించారు. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యక్రమాలలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఆయన ప్రసంగం ఆద్యంతం హృద్యంగా సాగింది. తొలుత ఆయనకు మేళతాళలు, వేదమంత్రాల మధ్య ఆలయ ఈవో రామారావు, అర్చక బృందం పూర్ణకలశ స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్, జ్యోతిర్మయి, దేవదాయ కమిషనర్ సత్యనారాయణ దంపతులు, జాయుంట్ కమిషనర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.