బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రెమల్ తుఫాన్‌గా మారి.. నేడు తీరాన్ని తాకనుంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. రెమల్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. రెమల్ తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.
ఇక రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య గంటకు 11 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఆదివారం రాత్రి తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేయాలని కోల్‌కతా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. రెమల్ తుఫాన్ దెబ్బకు ఏకంగా 21 గంటల పాటు అన్ని విమాన సర్వీసులను నిలిపివేయాలని సూచించింది. ఈ తుఫాన్ ప్రభావంతో మే 28 వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి తుఫానుగా మారింది. ఈ తుఫాన్‌కు రెమల్ అని పేరు పెట్టారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు.. మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు.. ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
ఇక ఇవాళ నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 31 వ తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌పై రెమల్ తుఫాన్ ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్ ప్రభావం లేకపోయినా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉందని పేర్కొంది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, గుంటూరు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిశాయి.