రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా రావడం ఖాయమని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రశాంత్ కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవని ఎద్దేవా చేశారు. ఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందని అభిప్రాయపడ్డారు. మంగళవారం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు. 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైయస్ఆర్‌సీపీఎక్కడ విఘాతం కలిగించలేదన్నారు. టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైయస్ఆర్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందన్నారు. మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదు. అసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైయస్ఆర్‌సీపీ గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం వైయస్ జగన్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.