చట్ట విరుద్ధంగా లాకౌట్ విధించిన యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా, కొత్తవలస జే ఎస్‌ఎల్ కర్మాగారం ఆవరణలో కర్మాగారం లాకౌట్‌కు నిరసనగా కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా పాటలు పాడి దుయ్య బట్టారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు యాజమాన్యాలకే వంత పాడుతున్నాయి తప్ప కార్మికుల కోసం కనీసం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్మికులకు ముందస్తు సమాచారం లేకుండా యాజమాన్యం లాకౌట్ విధించడం చట్టవిరుద్ధమని, అందుచేత యాజమాన్యంపై ముందుగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. లాకౌట్ ఎత్తేసే వరకూ ప్రతి కార్మికుడికీ యాజమాన్యం పూర్తి వేతనం చెల్లించాలన్నారు. కార్మిక శాఖ అధికారులు కూడా యాజమాన్యం తీరుపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కాంట్రాక్టు, రెగ్యులర్ అనే తారతమ్యం లేకుండా కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయాలని హితవు పలికారు. లాకౌట్ ఎత్తేసే వరకు ప్రజా నాట్యమండలి తరపున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షుడు పిల్లా అప్పలరాజు, మూడు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.