సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే రైజ్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మూడంచల భద్రత కల్పిస్తున్నట్లు ఒంగోలు జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినే్‌షకుమార్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్‌తో చర్చించారు. అంతకు ముందు ఒంగోలు ప్రకాశంభవన్‌లోని స్పందన హాలులో ఎస్పీతో కలిసి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ జరిగే రైజ్ కాలేజీ ప్రాంగణం మొత్తం పటిష్ట భద్రతతోపాటు సీసీ టీవీల పర్యవేక్షణలో ఉన్నదన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం ఆరు గంటలకు అభ్యర్థులు, ఏజెంట్లు విధిగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు సిబ్బందికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, అభ్యర్థుల కోసం వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీ ప్రత్యేక రంగులు ఉండే గుర్తింపు కార్డులను ఇస్తామన్నారు. ఇవే రంగులతో ఆయా కౌంటింగ్ కేంద్రాల ముందు ప్రత్యేక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లుగా ఉండేవారు జూన్ 1వతేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రత్యేకంగా టీ, భోజన విరామ సమయం లేకుండా నిరంతరం ఓట్ల లెక్కింపు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, భద్రతాపరంగా చేపడుతున్న చర్యలను ఎస్పీ గరుడ్ సుమిత్ వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై ఒకవైపే రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైజ్ కాలేజీకి అర కిలోమీటర్ దూరంలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. వెహికిల్, ఏజెంట్ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే రైజ్ కాలేజీ మార్గంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్‌లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఏఆర్వో ఝాన్సీలక్ష్మి, డీఆర్వో శ్రీలత, సంతనూతలపాడు ఆర్వోగా ఉన్న జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో పాటు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు పాల్గొన్నారు.