ఈసారి దేశంలో ఎండలు బీభత్సం సృష్టించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. దీనికి తోడు దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి కొరత తీవ్ర అవస్థలకు గురి చేసింది. ఇక సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నీటి సమస్యతో ఏ స్థాయిలో ఇబ్బందిపడిందో దేశం మొత్తం చూసింది. నీటి కొరతను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం, ప్రజలు ఎన్నో కొత్త కొత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా నీటి కొరతను అడ్డుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నీటిని వృథా చేసేవారికి రూ. 2 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత వేధిస్తుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నీటి వృథాను అరికట్టేందుకు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2 వేలు ఫైన్ వేయనున్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి మార్లేనా తాజాగా వెల్లడించారు. కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుకునే నీటిని నిర్మాణాలు, వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించడం వంటి చర్యలపై కఠినంగా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఢిల్లీలో నీటి వృథాను అరికట్టేందుకు స్పెషల్ టీమ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి అతిషి మార్లేనా ఆదేశించారు. ఢిల్లీ వ్యాప్తంగా 200 స్పెషల్ టీమ్‌లు.. నీటిని వృథా చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు నియమించాలని అధికారులకు సూచించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచే ఈ స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగి.. ఢిల్లీలో నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓకు మంత్రి అతిషి మార్లేనా లేఖ రాశారు.
ఢిల్లీలోని నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు.. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పోరాటం చేస్తోంది. హర్యానా నుంచి ఒకట్రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే.. దానిపై న్యాయ పోరాటం చేస్తామని మంత్రి అతిషి.. మంగళవారమే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుని.. నీటి కొరత రాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. నీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అతిషి ఆదేశించారు.